హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి అతిత్వరలో దేశవ్యాప్తంగా విస్తరించి, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆకాంక్షించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, ఎస్సీలకు రిజర్వేషన్ 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాదిగ సంఘాల జేఏసీ ప్రతినిధులు 2 రోజుల ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పిడమర్తి రవి హాజరై మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం చారిత్రక అవసరమన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, మాదిగల అస్తిత్వ పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా ముగింపు పలుకుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పీ వెంకటేశ్వరరావు, దళితసంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బాబూరావు, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కే ధీరన్, రాష్ట్ర అధ్యక్షుడు బీ వీరేందర్, ఉపేందర్, మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు