కరీంనగర్, మార్చి 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితబంధు పథకాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంత మంది అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్న తీరుపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. లబ్ధిదారుల యూనిట్ల కొనుగోలు విషయంలో కమీషన్లకు సంబంధించి.. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అధికారులతో కలసి నడుపుతున్న బాగోతాన్ని ఎండగడుతూ.. దళిత బంధుకు ‘కన్నం’! లబ్ధిదారులకు ఇచ్చే నిధుల్లో ఓ అమాత్యుడి కమీషన్ల వేట శీర్షికతో ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచురించిన విషయం తెలిసిందే.
దళిబంధు యూనిట్లు గ్రౌండింగ్ చేయడానికి బేరసారాలు చేస్తున్న వైనం.. చెప్పిన యూనిట్ తీసుకోవాలంటూ చేస్తున్న ఒత్తిళ్లు.. మార్గదర్శకాలను తుంగలో తొక్కి వసూళ్లుకు పాల్పడుతున్న పర్వం వంటి పలు అంశాలను కథనం ద్వారా ‘నమస్తే’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన అధికార యంత్రాగం.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వినోద్‌ను తొలగించి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి పవన్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆదేశాలు జారీ చేశారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి, 18 వేల మందికి రూ.10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమచేశారు. వీరిలో అత్యధికులు యూనిట్లు స్థాపించుకోగా, కొంతమంది ఖాతాల్లోని నిధులు డ్రా చేసుకుంటున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో 7,634 మందికి చెందిన రూ.281.84 కోట్లు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. ఎన్నికల అనంతరం నిధుల విడుదలపై అధికారుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఖాతాలపై ఫ్రీజింగ్ ఎత్తేసి, నిధులు విడుదల చేయాలని జనవరి 28న కలెక్టర్‌ను ఆదేశించింది.