హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం మోసమంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, దళిత సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఒకవేళ మీరు ఇక్కడ అధికారంలోకి వస్తే ఏమి ఇస్తారో కూడా తెలుసని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నా పదవుల కోసం పెదవులు మూసుకొని ఉంటున్నవారికి దళితుల గురించి మాట్లాడే హకు లేదని ధ్వజమెత్తారు. దళితులపై బీజేపీకి ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఆవాలు హరిబాబు, గఫార్, శశి, వేముల శ్రీనివాస్, మర్రి రణధీర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.