హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తీర్పుతోనే ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఎట్టకేలకు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని తెలిపారు. మంగళవారం శాసనసభలో వర్గీకరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. నిరుడు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మద్దతిచ్చిందని అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ తీర్మానం ఆమోదించడంతోపాటు, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే వర్గీకరణ గ్రూప్-2 కేటగిరీలోని 9% రిజర్వేషన్ను పెంచాలని డిమాండ్ చేశారు.