హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ వర్సిటీలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నది. ఉద్యోగాల భర్తీని చేపట్టడం లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను భర్తీ చేయడంలో అలసత్వం వహిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ వర్సిటీల్లో 878 ఎస్సీ, 520 ఎస్టీ రిజర్వుడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షాత్తు కేంద్రం ప్రభుత్వమే ఇటీవల ఈ విషయాన్ని పార్లమెంట్లో వెల్లడించింది. మొత్తంగా సెంట్రల్ వర్సిటీల్లో 6,028 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో ప్రకటించిన కేంద్రం.. తాజాగా ఎస్సీ, ఎస్టీ పోస్టుల ఖాళీలను ప్రకటించింది.
పీహెచ్డీ అడ్మిషన్లపై ప్రభావం..
సెంట్రల్ వర్సిటీలను రీసెర్చ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా భావిస్తారు. ఈ కారణంగానే వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తారు. కానీ బోధనా సిబ్బంది కొరత పీహెచ్డీ అడ్మిషన్లపై ప్రభావం చూపుతున్నది. గైడ్స్ కొరత కారణంగా పీహెచ్‌డీలో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు.