కోస్గి, ఆగస్టు 16 : ‘మా స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారు.. అధికార పార్టీ ఆగడాలతో దిక్కుతోచడంలేదు.. ఎవరికీ చెప్పుకునే దిక్కులేదు’ అంటూ ఓ బాధిత కుటుంబం కన్నీటితో మొరపెట్టుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో సానె లక్ష్మీనారాయణ, శివలీల దంపతులకు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో సగం వరకే ఇంటి నిర్మాణంచేసి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం నేపథ్యంలో పాత గోడలు కూల్చి వేస్తున్నామని చెప్పి.. వీరి ఇంటి గోడలను సైతం కూల్చి వేశారు. నాటి నుంచి ఈ స్థలం తనదే అంటూ గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ప్రకటించి, ఈ స్థలాన్ని బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణ కోసం ఇచ్చాడు. సదరు దంపతులు ఆ స్థలం తమదే అని ఆధారాలు చూపించినా వినకుండా వారిపై దాడిచేసినట్టు తెలిసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోకుండా కబ్జాదారులకే మద్దతు పలుకుతున్నారని ఆవేదనచెందారు. కలెక్టర్ కార్యాలయంలో గతవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. సర్వే చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.