మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 2: రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అరిగోస పడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శనివారం మహబూబాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం, వంటశాల, డైనింగ్ హాల్, హ్యాండ్‌వాష్ ప్రదేశాలు అపరిశుభ్రంగా, పాకురు పట్టి ఉండటాన్ని చూసి క్లీన్ చేసే సిబ్బంది ఉన్నారా లేరా.. అని ఆర్సీవో రత్నకుమారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గురుకుల భవన నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి నిధులను కూడా కేటాయించామని గుర్తుచేశారు. రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అద్దె భవనంలో కొనసాగుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక దగ్గర గురుకులంలో ఫుడ్ పాయిజన్ అవుతున్నదని, అనేక చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని, మెరుగైన వసతులు కల్పించాలని స్వయంగా విద్యార్థులే పాదయాత్రలు చేస్తున్నారని తెలిపారు. గిరిజనులు ఓట్లు వేస్తే గెలిచిన ఇక్కడి ప్రజాప్రతినిధులు గురుకులాలను పరిశీలించి విద్యార్థులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌చేశారు.