కేసముద్రం, ఏప్రిల్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత పెరిగి మళ్లీ బీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎల్కతుర్తిలో నిర్వహించే బారీ బహిరంగసభకు కార్యకర్తలు, నాయకులు భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత 50 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని, వాళ్ల హైకమాండ్ ఢిల్లీ పెద్దలని, వాళ్లు చెప్పినట్టే వినాలని తెలిపారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే కేసీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నిధులు ఆగిపోయాయని చెప్పారు. ఇప్పటి వరకు రూ.లక్షా 62 వేల కోట్లు అప్పు తెచ్చిన రేవంత్‌రెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ఓలం చంద్రమోహన్, రావుల శ్రీనాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.