హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): లగచర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిష న్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా ఇచ్చారు. లగచర్ల సహా సమీప గ్రా మాల్లో కమిషన్ పర్యటిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో తనను కలిసిన లగచర్ల బాధితులతో ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు. బాధితులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. బాధితుల తరఫున చైర్మన్‌కు కలిసి వివరించారు. అనంతరం రాథోడ్, ఆర్ఎస్పీ తో కలిసి లగచర్ల బాధితులు చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందచేశారు. పోలీసులు లం బాడీ మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన తీరు గురించి బాధిత మహిళలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తమ భూములను కాపాడాలని, గ్రామాల్లో అరెస్టు చేసిన తమ వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు.
లగచర్ల సంఘటన చాలా బాధాకరమని చైర్మన్ వెంకటయ్య ఈ సందర్భంగా తెలిపారు. అనాదిగా, వందల ఏండ్ల నుంచి భూమినే నమ్ముకుని బతుకుతున్న వారి నుంచి ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదని, రైతులు ఒప్పుకున్న భూముల్లో కంపెనీ నిర్మిస్తే ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. ఎకరం, అర్దెకరం భూమినే నమ్ముకొని తండాల్లో బతుకుతున్న వారి భూములు ఫార్మా కంపెనీల కోసం ఇవ్వమంటే, వాళ్ల కుటుంబాలు ఏమైపోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కార్మికులుగా, బేకరీలల్ల, హోటళ్లలో, ఇండ్లలో పనిచేసుకుంటూ చిప్పలు కడుక్కొని బతకాలా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దోషులపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డివి కక్ష రాజకీయాలు: సత్యవతి
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా రాజకీయ కక్షలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రేవంత్ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠకు లగచర్ల ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. దాడి చేశారన్న నెపంతో అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉన్నదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తన అధికారం, దూరహంకారం గిరిజనులపై చూపిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఫార్మా సిటీ ప్రయత్నాన్ని విరమించుకొని, గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లగచర్లకొచ్చి వాస్తవాలను తెలుసుకోవాలని కోరా రు. అధికారులపై దాడిని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.
పోలీసులపై అట్రాసిటీ కేసులు పెట్టాలి: ఆర్ఎస్పీ
లగచర్లలో బాధితులు అధికారులు కాదని, పేద గిరిజన మహిళలు అని బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. తమపై అత్యాచార ప్రయత్నాలు జరిగాయని పలువురు మహిళలు స్వయంగా చెప్పారని తెలిపారు. ఈ మేరకు గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కమిషన్‌ను కోరామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. లగచర్ల గిరిజనులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ న్యాయం చేస్తుందని తాను నమ్ముతున్నానని తెలిపారు. జాతీమ మహిళా కమిషన్‌కు, జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యా దు చేస్తామని స్పష్టంం చేశారు.
మాకు రేవంత్‌రెడ్డి ఏమీ మంచి పనులు చేయలేదు. ఉన్న భూమున్నీ తీసుకుంటని అంటుండు. అల్లుడి కోసం, బావా బామ్మర్దుల ఫార్మా కంపెనీల కోసం మా భూములు కావాలంట. మేం రైతు బిడ్డలం. మా పేదల భూములే ఎందుకు తీసుకుంటున్నారు? రెడ్డీల భూములు లేవా? ‘మాకు ఫార్మా వద్దు.. మా భూములు పోవద్దు. మా భూముల కోసం సచ్చేందుకైనా సిద్ధం. అధికారులపైన దాడి చేయలేదు. కలెక్టర్ వస్తడని మాకు చెప్పనేలేదు. రాహుల్‌గాంధీ.. ఏడున్నా మా కొడంగల్ గడ్డకు రావాలి. లేదంటే మేమే నీ దగ్గరకు వస్తం. మా వోళ్లందరినీ విడిచి పెట్టండి.
– జ్యోతి, లగచర్ల బాధిత మహిళ
‘పోలీసోళ్లు అర్ధరాత్రి ఇండ్లళ్లకు వచ్చి.. తలుపులు తీసి, ఆడోళ్ల కుతిక పట్టి పిసుకుడు, నెత్తి పగులకొట్టుడు అయింది. ఇదేం పద్ధతి. రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి ఓటేస్తే మా ఆడోళ్ల మీదకు పోలీసుల్ని తోల్తరా? ఆల్లకు ఓటేస్తే మాకేమీ ఫాయిదా లేదాయే. ఉన్న భూముల్ని లాక్కునేందుకు మామీదనే దాడులాయే. ఇప్పటిదాకా రేవంత్‌రెడ్డి మాకేమీ ఇయ్యలేదు. ఆరు గ్యారెంటీలు అనుడే కానీ, ఇంతవరకు అమలే చేయకపాయే. మేము రైతు బిడ్డలం. భూముల మీద బతికిన వాళ్లం. మా భూములు ఎందుకివ్వాలి. మా తాత, ముత్తాతల నుంచి వస్తున్న భూములు.
– సుశ్లీబాయి, లగచర్ల బాధిత మహిళ