ఎల్కతుర్తి, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ వైపు యావత్ దేశం, కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రధాన వేదిక వద్ద పనుల గురించి వాకబుచేశారు.
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. కాంగ్రెస్ పాలనను చూసి తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ పాలనను, నేటి పాలనను చూసి అర్థం చేసుకున్న ప్రజలు కేసీఆర్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎల్కతుర్తి రజతోత్సవ సభ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
బలంగా ఉన్న బీఆర్ఎస్ సభకు అడ్డంకులు కలిగిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించే అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరి చూపు ఎల్కతుర్తి వైపే ఉంది. రాష్ట్రం తెచ్చిన నేతగా, 10 ఏండ్లు అభివృద్ధి చేసిన నాయకుడిగా కేసీఆర్ మాటలు వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
-తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ