మహబూబాబాద్ రూరల్, మే 10 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్‌చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రేవంత్ పాలనలో తెలంగాణలో క్రైమ్ రేట్ 13.62 శాతం పెరిగిందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ మాజీ ఐపీఎస్ భార్యను పని మనిషి హత్య చేస్తే ఇంత వరకు కేసును ఛేదించలేదని మండిపడ్డారు. బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఆరు నెలలుగా ఓ బాలికను లొంగదీసుకుని ఇబ్బంది పెట్టడంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నామమాత్రపు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సభలో ప్రధాని నరేంద్రమోదీ బాలికకు జరిగిన అన్యాయంపై స్పందించాలని, వెంటనే బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.