హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. బుధవారం 63,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు వచ్చిందని తెలిపారు.
శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీఅనంతాళ్వారు 969వ అవతారోత్సవాన్ని ఈ నెల 19న తిరుమలలోని పురుశైవారి తోటలో నిర్వహించనున్నారు. ఆళ్వారు దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వారు బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తున్నామని..16 మంది పండితులు పాల్గొని ఉపన్యసించనున్నారని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.