భారత్ రాష్ట్ర సమితి.. కేసీఆర్ పార్టీ పేరు ప్రకటించిందే తడవుగా కేసీఆర్ వెన్నంటి నడవడానికి వివిధ ప్రాంతాల ప్రజలు నడుంకట్టి సిద్ధమయ్యారు. తొలి స్పందనగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ నేతలు సమావేశమై బీఆర్ఎస్కు జిందాబాద్ కొట్టారు. తమ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని ప్రకటించారు.
బాసర, అక్టోబరు 9: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ఓ అతిథి గృహంలో ఆదివారం మహారాష్ట్రలోని ధర్మాబాద్ మండలానికి చెందిన 25 మంది సర్పంచ్‌లు భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన జాతీయ పార్టీ టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో మూకుమ్మడిగా చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు వంటి అనేక పథకాలకు అకర్షితులయ్యామని తెలిపారు. త్వరలోనే కేసీఆర్‌ను కలిసి తమ ప్రాంతంలో పర్యటించాలని కోరతామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మాబాద్ మండలం రత్నెల్లి సొసైటీ సభ్యుడు శంకర్‌పటేల్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సురేఖ లక్ష్మణ్‌రావు, లింగారెడ్డి, ధర్మాబాద్ తాలూకాలోని 25 మంది సర్పంచ్‌లు, బాసర మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు కోర్వ శ్యామ్‌లు ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సారు రైతుల కు మస్తు చేస్తున్నడు. ఉచితంగా కరంటు ఇస్తున్నడు. రైతు సచ్చిపోతే 5 లక్షలు వచ్చేట్టు చేసిండు. పెట్టుబడికి రైతుబంధు కింద పైసలిస్తున్నడు. ఆడపిల్లల లగ్గమైతే రూ.1,00,116 ఇస్తున్నడు. మంచి సౌలత్లు కల్పిస్తున్నడు. దేశంల ఎక్కడా గిసోంటి పథకాలు లేవు. గిటువంటి సీఎం మాకుంటే బాగుండు.
– సాయినాథ్, ఉప సర్పంచ్, బన్నెల్లి.
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకర్తగా కేసీఆర్ తెలంగాణలో చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినయ్యా. కేసీఆర్ సారు మా ధర్మబాద్ ప్రాంతాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధర్మబాద్ తాలూకా ప్రజలతోపాటు నాందేడ్ జిల్లా మొత్తం రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులు కేసీఆర్ స్థాపించే పార్టీకి మద్దతుగా ఉన్నారు.
– శంకర్ పాటిల్, ధర్మాబాద్ సామాజిక కార్యకర్త.
చంద్రశేఖర్‌రావు ప్రకటించిన జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి పూర్తి మద్దతు తెలుపుతున్నం. గిప్పటికే మేము మద్దతిస్తున్నామని కేసీఆర్‌కు లెటర్ కూడా పంపినం. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని కూడా కలిసినం. మా వద్ద రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం.
– లక్ష్మణ్ నిదాన్కర్, బన్నెల్లి, సర్పంచ్ల సంఘం ఫోరం అధ్యక్షురాలి భర్త