డిచ్పల్లి, మే 1 : ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఓ రైతు, మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంంలోని ఎల్లారెడ్డిపల్లిలో శుక్రవారం జరిగింది. ఎల్లారెడ్డిపల్లిలో వడ్లు కొనకపోవడాన్ని నిరసిస్తూ రైతులు ఇందల్వాయి-ధర్పల్లి రహదారిపై ధాన్యాన్ని పోసి ధర్నా చేపట్టారు. ఆ ధాన్యాన్ని కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో సర్పంచ్ భర్త, రైతు, మాజీ సర్పంచ్ మఘంల శేఖర్ బాటిల్లో తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పక్కనే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి సూచించారు. కనీస మద్దతు ధర రూ.2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. మక్కజొన్నల కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్‌కు అనుమితిచ్చి బ్యాంక్ గ్యారెంటీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందున మార్క్‌ఫెడ్ అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయలన్నారు. ఇంకా కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తక్కువ ధరకు మారెట్లో అమ్ముకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.