మొగుళ్లపల్లి, జనవరి 01 : ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని వారం రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. హనుకొండ జిల్లా మెగుళ్లపల్లి మండలం గుండ్లకర్తి గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల వాటర్ ప్లాంట్ చెడిపోయింది. నాటి నుంచి దాదాపుగా రెండు సంవత్సరాలుగా వాటర్ ప్లాంట్ పనిచేయక ప్రజలకు మంచినీళ్లు అందకుండా పోయాయి.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లింగంపల్లి సంజీవరావు తాను గెలిస్తే వారం రోజుల్లో మంచి నీటి సమస్య పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ మేరకు మళ్లీ సురక్షితమైన మంచినీటిని గ్రామ ప్రజలకు అందించి ప్రజల చేత శభాష్ అని అనిపించుకున్నాడు. ఈ సందర్బంగా సర్పంచ్ సంజీవ రావు మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.