మహదేవపూర్(కాళేశ్వరం), మే 15 : కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రాన త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగింది. దక్షిణాది రాష్ర్టాల్లో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఏకైక త్రివేణి సంగమ క్షేత్రం తీరాన ఉదయం 5.44 గం టలకు పుషరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోట సరస్వతీ నది అంతర్వాహినిగా ఉండే ఈ ప్రాంతంలో పుష్కరాల నిర్వహణకు ఎంతో విశిష్టత ఉన్నది. అత్యంత అరుదైన సరస్వతీ పుషరాల నేపథ్యంలో పవిత్ర త్రివేణి సంగమంలో గురుమదానానంద సరస్వతి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి పుషర స్నానాలను ప్రారంభించారు. వేద పండితులు సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడికి తొలి పూజలు చేసిన తర్వాత సరస్వతీ నది పుషర మహోత్సవానికి అంకురార్పరణ చేశారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పుషర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి, శుభానందాదేవి, సరస్వతీ మాత ఆలయాలను ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ తీరం వద్ద పితృ తర్పణాలు, సంకల్ప పూజలు నిర్వహించారు. రోజుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేయగా, మొదటిరోజు భక్తుల రద్దీ మందకొడిగా ఉన్నది. త్రివేణి సంగమం వద్ద సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థ పడ్డారు. చలువ పందిళ్లు సరిపడా లేక చిన్నారులు, వృద్ధులు ఎండవేడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుషరాల్లో పూజలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 600మంది పూజారులు త్రివేణి సంగమానికి వచ్చారు.