హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సారా రక్కసి మళ్లీ కోరలు చాస్తోంది. ఏ పల్లెల్లో చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. అదే స్థాయిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదివారం విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆ లెక్కల ప్రకారం నిరుడు జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి పది జిల్లాల్లో 1,674 సారా కేసులు నమోదవగా.. ఈ ఏడాది తొలి రెండు నెల్లల్లో ఆ సంఖ్య 2,753కు పెరిగింది. ఈ కేసుల్లో 2,578 మందిని అరెస్టు చేశారు. 13,122 లీటర్ల నాటుసారా, 4,720 కేజీల పటిక, 39,887 కేజీల బెల్లం, 424 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నాటుసారా తయారీదారులకు రూ.29.55 లక్షల జరిమానా విధించారు. గత రెండు నెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,142 కేసులు, ఆదిలాబాద్‌లో 369 కేసులు, నల్లగొండలో 282, కరీనంగర్‌లో 257, మహబూబ్‌నగర్‌లో 223, ఖమ్మంలో 154, నిజామాబాద్‌లో 152, రంగారెడ్డిలో 116, మెదక్‌లో జిల్లాలో 58 కేసులు నమోదైనట్టు కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం 25 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సారా తయారీ, అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ టీమ్‌లు, సివిల్ పోలీసుల సహకారంతో ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపడున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. సారా తయారీ, అమ్మకాలను అరికట్టడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు నగదు రివార్డులు ఇవ్వాలని కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు.