హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేసేందుకు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన సార్ (సింథటిక్ ఆపరేట్) డాటాను వినియోగించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం పంటల సాగు విస్తీర్ణానికి సార్డాటా వినియోగం ప్రాజెక్టు ప్రతిపాదనపై సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణాన్ని అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు పంటలవారీగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటికి అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్డర్ సమీరేండు మహంతి, శాస్త్రవేత్త డాక్టర్ టీఎల్ నీలిమ, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం బలరాం, డిజిటల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాలతో విత్తనోత్పత్తి
రాష్ట్రంలో సహకార సం ఘాల ద్వారా విత్తనోత్పత్తి అవకాశాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ వర్సిటీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల్లో విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులను ఎంపిక చేసే నూతన ప్రతిపాదనలపై మంత్రి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాల కొరతను అధిగమించడానికి ప్రతి జిల్లాలో ఇప్పటికే ఎఫ్పీవోలుగా రూ పాంతరం చెందిన రెండు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘాలను ఎంపిక చేయాలని సూచించారు.