హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): లండన్‌లోని చరిత్రాత్మక ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ (హౌస్ ఆఫ్ లార్డ్స్) వేదికగా తెలంగాణ పల్లెలో పుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఘనత విశ్వవ్యాప్తమైంది. లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్‌లో భాగంగా బుధవారం జరిగిన ‘ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్’ సదస్సులో తెలంగాణ పర్యావరణ నమూనాకు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు లభించింది. రాంఫాల్ ఇన్స్టిట్యూట్, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మన్ సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా కీలక ప్రసంగం చేశారు. ‘నేను ఒక రాజకీయ నాయకుడిగా ఇకడికి రాలేదు. వేకువజామునే నీళ్లు మోసుకొచ్చి నీటి విలువ తెలుసుకొన్న తెలంగాణలోని కొదురుపాక అనే చిన్న గ్రామానికి చెందిన ఒక బిడ్డగా వచ్చాను’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణలోని ఒక పల్లెటూరిలో మొదలైన చిన్న ఆలోచన ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’కు ఎలా చేరుకున్నదో ఆయన వివరించారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ద్వారా ఎలాంటి బడ్జెట్ లేకుండా కేవలం ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణాన్ని ఎలా కాపాడుతున్నామో వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటివరకు 19.6 కోట్ల మొకలు నాటామని తెలిపారు. ఈ మహాక్రతువులో 4.4 కోట్ల మంది పౌరులు భాగస్వాములయ్యారని చెప్పారు. యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమాల్లో ఒకటిగా మారిందని పేర్కొన్నారు.

రాబోయే గ్లాస్గో-2026 కామన్వెల్త్ గేమ్స్, ఆంటిగ్వా, బార్బుడాలో నిర్వహించే చోగమ్ సమావేశాల కంటే ముందు జరుగుతున్న ఈ లండన్ సదస్సు పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ ైక్లెమేట్ యాక్షన్ వీక్ నిర్వహిస్తామని సంతోష్‌కుమార్ వెల్లడించారు. ‘వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం)’ అనే భారతీయ సిద్ధాంతంతో పర్యావరణ పరిరక్షణకు అందరూ ఒకే కుటుంబంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను ఎదురోవడానికి కామన్వెల్త్ దేశాలతో, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
4 కోట్ల 40 లక్షల మంది పౌరులు, యువత, క్రీడాకారుల భాగస్వామ్యంతో నడుస్తున్న జీఐసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం గర్వకారణంగా ఉన్నదని యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లైఫ్పీర్ ఉదయ్ నాగరాజు తెలిపారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో విజయవంతమైన ఈ విధానాన్ని గ్లోబల్ నార్త్ (పాశ్చాత్య) దేశాలకు విస్తరించేందుకు, తద్వారా ఖండాలకతీతంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కామన్వెల్త్ సెక్రటేరియట్ సీనియర్ డైరెక్టర్ సురేశ్‌యాదవ్ మాట్లాడుతూ.. పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు యువత ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు తమ సెక్రటేరియట్ పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఆంటిగ్వా అండ్ బార్బుడా హైకమిషనర్ కరెన్-మే హిల్ మాట్లాడుతూ.. క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడాకారులను పచ్చదనం పెంపుదలలో భాగస్వాములను చేసినందుకు ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థను అభినందించారు.
రాబోయే గ్లాసో-2026 కామన్వెల్త్ గేమ్స్‌ను తకువ కార్బన్ ఉద్గారాలు, జీరోవేస్ట్ (చెత్తలేని) క్రీడలుగా నిర్వహించనున్నట్టు కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రతినిధి ప్రిత్పాల్ సుర్జ్ ప్రకటించారు. క్రీడల ద్వారా వెలువడే 95% చెత్తను డంపింగ్ యార్డ్‌లకు వెళ్లకుండా రీసైకిల్ చేస్తామని, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని తెలిపారు. క్రీడలు ప్రారంభం కావడానికి ముందే కామన్వెల్త్ దేశాల జలవనరుల నుంచి పది లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు రాయల్ కామన్వెల్త్ సొసైటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. రాంఫాల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ గోమెజ్ మాట్లాడుతూ.. కొన్ని దేశాల జనాభా కంటే ఇగ్నైటింగ్ మైండ్స్ ద్వారా నాటిన మొకల సంఖ్యే ఎకువగా ఉన్నదని ప్రశంసించారు. శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర అభివృద్ధి, ప్రకృతి ఆధారిత పరిషారాలు (సీవీడ్, బ్లూ-కార్బన్ విధానాలు) వంటి అంశాలపై ఇగ్నైటింగ్ మైండ్స్‌తో కలిసి పనిచేయడానికి ఆయన ఆసక్తి కనబరిచారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ సాధించిన అద్భుతమైన ఫలితాలను ఈ సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2018లో ప్రారంభమైన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటివరకు 19.6 కోట్లకుపైగా మొకలు నాటారు. సాంకేతికతను జోడించి 2024 నుంచి వీటికి జియో-ట్యాగింగ్ చేయడంతోపాటు శాటిలైట్ ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో 4.4 కోట్ల మంది పౌరులు భాగస్వాములయ్యారు. 33 దేశాల్లో 21 వేలకుపైగా నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టడం ద్వారా ఏటా 3.57 టీఎంసీల నీటిని ఆదా చేస్తున్నారు.
ఈ కార్యక్రమం భారత రాష్ట్రపతి ప్రశంసలతోపాటు వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ 29వ సదస్సు (యూఎన్ఎఫ్సీసీసీ సీవోపీ29), ఎడారీకరణను నిరోధించే ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ 16వ సదస్సు (యూఎన్‌సీసీడీ సీవోపీ 16) అబ్జర్వర్ హోదాను పొందింది. సదస్సు ముగింపులో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. గ్లాసోగేమ్స్, ఆంటిగ్వాలో జరిగే చోగమ్-2026 సదస్సుతోపాటు హైదరాబాద్ ైక్లెమేట్ యాక్షన్ వీక్-2026 విజయవంతానికి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు.
సంతోష్‌కుమార్‌పై కెన్యా ప్రతినిధి బృందం ప్రశంసల వర్షం కురిపించింది. కెన్యా డిప్యూటీ స్పీకర్ సెనేటర్ కతూరి మురుంగి నేతృత్వంలోని ఎంపీల బృందం మాట్లాడుతూ.. జీఐసీ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అవసరమైన గొప్ప ఉద్యమంగా కీర్తించారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నోబెల్శాంతి బహుమతికి సంతోష్ అర్హుడని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఇలాంటి పర్యావరణ ఉద్యమాన్ని కెన్యాలోనూ విస్తరించేందుకు సంతోష్‌కుమార్‌ను గ్రీన్ అంబాసిడర్‌గా ఆహ్వానిస్తున్నట్టు వేదికపైనే ప్రకటించారు. అడవుల పెంపకం కోసం ఇగ్నైటింగ్ మైండ్స్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు.
తెలంగాణ పచ్చబడటంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతను సంతోష్‌కుమార్ ఈ అంతర్జాతీయ వేదికపై కొనియాడారు. పురాతన భారతీయ సంప్రదాయమైన పంచభూతాల పరిరక్షణను కేసీఆర్ ఆధునిక పాలనతో మిళితం చేశారని, దాని ఫలితంగా కేవలం పదేండ్ల్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 21% నుంచి 28 శాతానికి పెరిగిందని చెప్పారు. అడవుల పునరుద్ధరణతో పులుల సంఖ్య 12 నుంచి 44కు చేరిందని, 5,000కుపైగా బోరుబావుల పునరుద్ధరణ ద్వారా ఏటా 3.57 టీఎంసీల నీటిని ఆదా చేస్తున్నామని వివరించారు. పర్యావరణంపై ప్రసంగాలు ఇవ్వడమే కాకుండా ఆచరణలో చూపించేందుకు ఈ సదస్సుకు హాజరైన ప్రతి అతిథికీ ఒక వెదురు మొకను జియో ట్యాగింగ్ చేసి బహుమతిగా అందజేశారు. వెదురు చెట్టు గాలిలోని కార్బన్‌ను నాలుగు రెట్లు ఎకువగా పీల్చుకోవడమే కాకుండా, భూమిని పునరుద్ధరించే అద్భుతమైన లక్షణం కలిగి ఉంటుందని చెప్పారు.