మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 02:39:38

పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా సంతోష్‌

పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా సంతోష్‌

  • 22 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీకి ఎంపికైన టీఆర్‌ఎస్‌ ఎంపీ
  • కేంద్ర  ప్రభుత్వరంగ సంస్థల పనితీరును మదింపు చేయనున్న పార్లమెంటరీ కమిటీ
  • తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ఎంపీగా ఖ్యాతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్‌కు నివేదికలు సమర్పించే పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ పార్లమెంటరీ కమిటీలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి ఏడుగురు కలిపి మొత్తం 22 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్య ఓటు ఆధారంగా రెండు సభల నుంచి కమిటీ సభ్యులను ఎన్నుకొంటారు. 

సంతోష్‌ తెలంగాణ నుంచి ఈ కమిటీకి ఎంపికైన తొలి ఎంపీ కావడం విశేషం. కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయడం, వాటి ఖాతాలను పరిశీలించడంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ పార్లమెంట్‌కు నివేదికలు ఇస్తుంది. ప్రాధాన్యం కలిగిన పార్లమెంటరీ కమిటీకి ఎంపికకావటంపై ఎంపీ సంతోష్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.


logo
>>>>>>