మెదక్ : మల్లినాథ సూరి పేర సంస్కృత వర్శిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలు ఇవ్వడం పట్ల రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్( State Council Chairman) ప్రొఫెసర్ లింబాద్రి హర్షం వ్యక్తం చేశారు. సూరి స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయం(Sanskrit University) ఏర్పాటుకు బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు వర్సిటీ కోసం అధికారులు గుర్తించిన స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగం(Telugu literature)లో జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన మల్లినాథ సూరి ఇక్కడి వారు కావడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, విద్యా శాఖ మంత్రి సూచనల మేరకు కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రెండు ప్రాంతాలలో స్థలాలను(Places) పరిశీలించామని ఆయన తెలిపారు.
రెండు స్థలాలు రోడ్డుకు సమీపంలో ఉండడం, నీటి సమస్య లేదని గుర్తించామన్నారు. మౌలిక సౌకర్యాలతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం ఎంపికకు సమగ్ర నివేదిక(Report)ను ప్రభుత్వానికి సమర్పిస్తామని లింబాద్రి అన్నారు. వారి వెంట మహారాష్ట్ర లోని రామ్టె టెక్ సాంస్కృతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మధుసూదన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంస్కృతిక అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కాలేజీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డాక్టర్ యాదగిరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.