కామారెడ్డి : సంస్కార్ ప్రకృతి ఆశ్రమ సేవలు బాగున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని బాన్సువాడ నియోజక వర్గం అక్బర్ నగర్‌లోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న సాధకులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి, ఆరోగ్య పరిస్థితి మెరుపడ్డ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..ఇక్కడి పరిస్థితి చూసి, మీ మాటలకు మంత్ర ముగ్ధులం అయ్యామన్నారు.
ఈ ఆశ్రమం బాగా విస్తరించాలని కోరుకుంటున్న. మంతెన సత్యారాయణసేవలు అభినందనీయం. దీనిని ఈహెచ్ఎస్ కింద చేర్చితే సంస్థ బాగా పని చేస్తుందని అందరూ కోరుతున్నారు. ప్రత్యేక కేసు లాగా తీసుకొని ఆ పని తప్పకుండా చేస్తామని మంత్రి హామీనిచ్చారు. రోగాలు రాకుండా ప్రజలు దవాఖానలకు వెళ్లకుండా రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యం అన్నారు.
అలాంటి సమాజాన్ని ప్రభుత్వాలు నిర్మించాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆ దిశగా రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, మిషన్ భగీరథ వంటి పథకాలు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతున్నాయి.
నేచురోపతి, ఇతర భారతీయ వైద్య విధానాలు నిరాదరణకు గురయ్యాయి. వాటి ప్రాధాన్యాన్ని పెంచి ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
అద్భుతమైన సాంప్రదాయ వైద్యం వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, ఈ సేవలు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీలు గంగాధర్, దేశ్ పతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, సురేందర్, హన్మంతు షిండే తదితరులు పాల్గొన్నారు.