Telangana | హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న హామీ కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి సన్నబియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు వస్తున్న కొత్త సన్నబియ్యం మూడు నెలలు నిల్వ చేస్తే బాగుంటుందని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సివిల్ సప్లయి భవన్లో ధాన్యం కొనుగోళ్ల వివరాల వెల్లడి కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సన్న బియ్యం ఉగాది నుంచి ఇస్తుందో, ఎప్పట్నుంచి ఇస్తుందో ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అవసరమైన సన్నబియ్యం ఇవ్వడానికి మాకేమీ ఇబ్బంది లేదు. అయితే కొత్త సన్నబియ్యం మూడు నెలలు స్టోరేజీ చేస్తే బాగుటుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నదని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 10.11 లక్షల టన్నులు దొడ్డు వడ్లు, 3.02 లక్షల టన్నులు సన్న వడ్లు కొనుగోలు చేసినట్టు వివరించారు. రైతుల నుంచి రూ. 3వేల కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా అందులో రూ.1560 కోట్లు అన్నదాతలకు చెల్లించినట్టు తెలిపారు. సన్న వడ్ల కొనుగోలు కోసం 4వేల ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డీఎస్ చౌహాన్ తెలిపారు. సన్నాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే గ్రామాలను జీపీఎస్ ద్వారా గుర్తించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఒకవేళ ఏదైనా గ్రామంలో సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోతే దగ్గర్లోని మరో గ్రామంలోని కేంద్రంలో విక్రయించాలని సూచించారు.