హిమాయత్‌నగర్/దుండిగల్, ఆగస్టు 25: కామారెడ్డి సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను సర్కారు తక్షణమే అమలు చేసి, బీసీ కులగణన చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ నేతృత్వంలో బీసీ నేతలు ఆమరణ నిరాహారదీక్షలకు దిగారు. బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైదర్‌గూడలో ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో సంజయ్‌కుమార్‌తోపాటు హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్లు, ప్రతినిధి చాపర్తి కుమార్‌కు పూలమాలలు వేసి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆమరణ నిరాహార దీక్షలను ప్రారంభించారు.
బీసీల హక్కుల కోసం జక్కని సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష శిబిరం వద్దకు సీఐ చంద్రశేఖర్, డీఎస్సై వెంకటేశ్ దీక్షా శిబిరానికి వచ్చి శాంతియుతంగా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం సంజయ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో సంజయ్‌కుమార్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ పరామర్శించి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కారుకు రాజకీయ సమాధి తప్పదని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని బీసీల విశ్వసనీయత కోల్పోక ముందే బీసీ కులగణన ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక విప్లవం కోసం బీసీల పోరాటాన్ని మొదలు పెట్టామని, బీసీలకు 42 శాతం రిజరేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌కు పలువురు బీసీ, ఇతర సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగాచారి, ప్రతినిధులు దాసోజు లలిత, పోశం అశోక్, పటేల్ వనజ, కొంగర నరహరి, సుజ్జి, వెంకటేశ్, అజయ్ పాల్గొని సంజయ్‌కుమార్ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. పోలీస్‌స్టేషన్‌లో బీసీ సంఘాల నేతలు మేకపోతుల నరేందర్‌గౌడ్, దాసు సురేశ్, నల్ల సూర్యప్రకాశ్ తదితరులు సంజయ్‌కుమార్‌ను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
హిమాయత్‌నగర్, ఆగస్టు 25: అరెస్టులు, అణచివేతలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరించారు. హైదర్‌గూడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్లు, నేత చాపర్తి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఈ ముగ్గురితోనే ఆగిపోదని, భవిష్యత్తులో అనేక మంది బీసీ నేతలు ఆమరణ దీక్షలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీసీ సంఘాల నేతలకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.