Sangareddy | నారాయణఖేడ్, ఏప్రిల్ 25: భార్యను కాపురానికి పంపించడం లేదన్న కోపంతో భార్య సహా అత్తామామలను చంపేందుకు కుట్ర పన్నిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవరావుపేట్ గ్రామానికి చెందిన ధనియాల రాములు కూతురు అనితకు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామానికి చెందిన గొల్ల రమేశ్‌తో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా రెండేండ్లుగా అనిత పుట్టింట్లోనే ఉంటున్నది.
ఈ నెల 12న అర్ధరాత్రి రమేశ్ అత్తగారింటికి వచ్చి భార్య అనితను పిలిస్తే ఎవరూ పలుకలేదు. కోపం పెంచుకున్న రమేశ్ విద్యుత్తు మీటర్ నుంచి తీగను తలుపు గొళ్లానికి తగిలించి ఇనుప రాడ్‌తో ఎర్తింగ్ ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. ఉదయం లేచిన రాములు తలుపు తీసే క్రమంలో విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమై ప్రమాదాన్ని గుర్తించిన రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి అల్లుడు రమేశ్‌ను నిందితుడిగా నిర్ధారించారు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.