సంగారెడ్డి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : అధికారంలో ఉండి కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ మాట్లాడారు. జనహిత యాత్రలో భాగంగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్.. హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ నేతల మాదిరిగా హరీశ్‌రావు చిల్లర రాజకీయాలు చేయరని, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్న మహేశ్‌గౌడ్ మతిపోయినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న హరీశ్‌రావుపై అవాకులు చవాకులు పేలితే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. హరీశ్‌రావు చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందు ఉన్నాయని, అందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిదర్శనమని అన్నారు. రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు మెప్పు కోసం బనచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తుంది నిజం కాదా? అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పాదయాత్ర అట్టర్‌ప్లాఫ్ అయ్యిందని ఆయన చెప్పారు.