రాయికోడ్, డిసెంబర్ 8 : ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన వారు తనకు మద్దతు పలుకడం లేదనే మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్‌పల్లిలో విషాదాన్ని నింపింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పీపడ్పల్లికి చెందిన చాల్కి రాజు (35) కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు.
ఎన్నికల ప్రచారానికి చేతిలో డబ్బులు లేకపోవడం, ఎన్నికల్లో పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటమే గాక వారు ఇతరులకు మద్దతు తెలుపుతుండటంతో ఇక తనకు ఓటమి తప్పదేమోనని నాలుగు రోజులుగా మానసికంగా కుంగిపోయాడు. ఇదే కారణంతో అయ్యప్ప మాలలో ఉన్న రాజు మండల పరిధిలోని శంషొద్దీన్పూర్ శివారులో ఆదివారం రాత్రి చెట్టుకు టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ రఘునందన్ సోమవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజు మృతి వివరాలను ఫోన్, ఘటన స్థలంలో లభించిన ఆధారాల మేరకు విచారణ చేపడుతామని తెలిపారు.