Telangana | లగచర్ల కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజీవ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
గుండెనొప్పితో బాధపడుతున్న రైతును హీర్యా నాయక్‌కు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి ఘటనపై విచారణ జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన విచారణ చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు.
సెంట్రల్ జైలుకు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు ఐజీ సత్యనారాయణ విచారణలో వెల్లడైంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా హీర్యా నాయక్ లగచర్ల కేసులో అరెస్టయితే.. బాలానగర్ కేసులో అరెస్టయినట్లుగా జైలు రికార్డుల్లో ఉన్నట్లుగా ఐజీ గుర్తించారు. దీంతో హీర్యా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది.