Sangameshwara Temple | కొల్లాపూర్, మార్చి 21 : 8 నెలల తర్వాత సప్త నదుల చెంత గంగమ్మ ఒడిలో ఉన్న లలితా సంగమేశ్వరుడు శుక్రవారం జలధివాసం వీడారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడు తెలకపల్లి రఘురామా శర్మ ఆధ్వర్యంలో బురుద మట్టితో నిండి వున్న ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఆలయ గర్భగుడిలోని వేపధార శివలింగం అలల ఆటుపోట్లను తట్టుకొని బురద మేట నుంచి చెక్కుచెదరకుండా కడిగిన ముత్యం వల్లే బయటకు వచ్చి భక్తులకు మహిమాహిత శక్తితో తొలిదర్శనం ఇచ్చింది.
తుంగ, భద్ర, కృష్ణ, వేణి, బీమా, మలాపహారణి అనే స్త్రీ నదులకు వ్యతిరేకంగా భవనాశి పురుష నది తూర్పు నుంచి పశ్చిమ దశకు ప్రవహిస్తూ ఉంటాయి. అయితే కృష్ణా నదికి వరద ఉధృతి అధికంగా వచ్చినప్పుడు అమావాస్య పౌర్ణమి రోజులలో అలల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో ఆలయ ప్రాంగణం ప్రతిసారి కొంత దెబ్బతింటుంది కానీ గర్భగుడిలోని వేపాదర శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదయం నుంచి ఆలయ ప్రధాన అర్చకులు రఘురామ శర్మతోపాటు ముచ్చుమరి తదితర సమీప గ్రామస్తులు ఆలయాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభ్రం చేయడంతో ఆలయంలోని లలితా సంగమేశ్వరుడిని నంది వీరభద్ర విగ్రహాలను పూలమాలతో సుందరంగా అలంకరించారు.
అలాగే హోమ గుండమును ఏర్పాటు చేశారు. జలదిగ్బంధం నుంచి లలితా సంగమేశ్వరుడు విగ్రహం బయటపడిన మొదటి రోజు కావడంతో ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇదే రోజు భక్తులకు తొలిదర్శన భాగ్యం కల్పించారు. శనివారం నుంచి మళ్లీ సంగమేశ్వర ఆలయం జలధివాసంలోకి వెళ్లే జులై మూడో వారం వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించి వేపాదార శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకోవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు.