కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ నిర్వహణలో నిలువెల్లా అక్రమాలే జరుగుతున్నాయని, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించార ని ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ వెల్లడించింది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని, క్వారీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టంచేసింది. క్వారీ నిర్వాహకులు కూల్చివేసిన బావులను పునరుద్ధరించి, రైతులకు న్యాయం చేయాలని డి మాండ్ చేసింది. చల్లూరు క్వారీలో జరుగతు న్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన అన్యాయం, బావుల పూడ్చివేత వంటి అనేక అంశాలను ఎండగడుతూ.. ఈ నెల 14న ‘బావులు పూడ్చి.. బోర్లుకూల్చి.. మానేరు ఇసుక దందా!’.. అదే నెల 15న ‘ఇసుక దందాకు రైతుల అడ్డుకట్ట’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
విచారణ జరిపిన అధికారులు.. అక్కడ అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు మొత్తం క్వారీ నిర్వాహకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, కండ్లముందు జరిగిన అక్రమాలను సైతం కప్పి పుచ్చి, కలెక్టర్‌నే పక్కదారి పట్టించారని రైతులు ఆవేదన చెందారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతు లు అధికారులను, వివిధ వర్గాలను కోరుతూనే ఉన్నారు. బాధిత రైతులు, స్థానికుల విజ్ఞప్తిపై స్పందించిన మానవ హక్కుల వేదిక, పర్యావరణ పరిరక్షణ వేదిక, రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యు ల నిజనిర్ధారణ బృందం సభ్యుల బృందం ఆదివారం చల్లూరు క్వారీ ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. ఈ సందర్భంగా బాధిత రైతులతో మాట్లాడి పలు వివరాలను సేకరించింది. ఇసుకతీతలో జరుగుతున్న ని బంధనల ఉల్లంఘనలను గుర్తించారు. అందు లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, పర్యావరణ వేత్త ఉమామహేశ్వర దహగమ, రైతు సమస్యల సాధనసమితి నాయకులు ముడిమడుగుల మల్లన్న, మానవ హక్కుల న్యాయవాది పందిళ్ల రంజిత్‌కుమార్, సామాజిక కార్యకర్త కొంటు రాజు పర్యటనలో ఉన్నారు.
క్వారీ నిర్వాహకుల ఉల్లంఘనలు ఇవే..
వీణవంక మండలం ఇప్పలపల్లి, చల్లూరు ఇసుక క్వారీ నిర్వాహకులకు, రైతులకు మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో తాము క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. క్వారీలో మొత్తం అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలే కనిపిస్తుంచాయని చెప్పారు. నదీగర్భాల్లో ఇసుక వెలికితీత గరిష్ఠంగా ఒకటి నుంచి రెండు మీటర్ల లోతుకు మించి తీయవద్దనే నిబంధనలు ఉన్నా.. ఇక్కడ 4 మీటర్లకు పైగా లోతులో ఇసుకను తవ్వినట్టు గుర్తించామని తెలిపారు. చల్లూరు గ్రామ శివారు వరకే ఇసుక తీయడానికి అనుమతి పొందిన క్వారీ యజమాని, చల్లూరు పొలిమేరలు దాటి, ఎగువన గల ఇప్పలపల్లి గ్రామ శివారులో కూడా తవ్వకాలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు గుర్తించామని చెప్పారు. ఇసుక తీయడానికి అడ్డుగా ఉన్నాయన్న ఉద్దేశంతో ఇప్పలపల్లి, చల్లూరు, మంచిర్యామి గ్రామాలకు చెందిన 30 వ్యవసాయ బావులను, వాటి మోటర్లను, నది నుంచి ఒడ్డు వరకు ఉన్న పైపులైన్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఫలితంగా ఇప్పలపల్లికి చెందిన సుమారు 170 మంది రైతులు, చల్లూరుకు చెందిన 10 రైతులు, మంచిర్యామికి చెందిన 20 మంది రైతుల వ్యవసాయ పంటలకు నీరు అందక ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని వివరించారు.
కలెక్టర్ పునరాలోచించండి!
నదీ గర్భంలో బావులు ఏర్పాటు చేసుకొని, నీటి ఊటను ఒడిసి పట్టుకొని, సొంత మోటర్లు, పైపులైన్లతో, ప్రభుత్వ విద్యుత్తు లైన్ల సహాయంతో సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి నీళ్లు పారించుకుంటున్న రైతులను చట్ట ఉల్లంఘనదారులుగా కలెక్టర్ ప్రకటించడం దారుణమని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రైతులే వాల్టా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బెదిరించడమే అన్యాయమని, అది చట్ట విరుద్ధం అని తెలిపారు. వాల్టా చట్ట ఉద్దేశం భూగర్భ జలాలను పరిరక్షించడం అని.. రైతులు వ్యవసాయ భూములకు నది గర్భం నుంచి నీటిని పారించుకోవడం వల్ల భూగర్భజలాలు అంతరించిపోవని తెలిపారు. వాల్టా చట్టం ఉపయోగించాల్సి వస్తే, ఇసుక క్వారీ యజమానిపై ఉపయోగించాలే తప్ప రైతులపై కాదని, ఈ విషయంలో కలెక్టర్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక తరలింపు కారణంగా ధ్వంసం అవుతున్న రోడ్లు, ఇండ్లు, పంట పొలాలకు క్వారీ యజమాన్యాన్నే బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సి ఉంటుందని చెప్పారు.