వికారాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కాగ్నానది పరీవాహక ప్రాంతం, శివసాగర్ నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. యాలాల మండలం నుంచే లక్షల క్యూబిక్ మీటర్లలో ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. బషీరాబాద్ మండలం కాగ్నా పరీవాహక ప్రాంతంలోని మంతటి, రెడ్డిఘనపూర్, ఎక్మయి, మైల్వార్ ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరిట పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతున్నది.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతులు పొంది, ఇందుకు విరుద్ధంగా రాత్రి వేళ సైతం ఇసుకను తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులే ఇసుక మాఫియా వెనుక ఉండి నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.