కొల్లాపూర్, ఆగస్టు 31 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింగాపురంలో హిటాచీతో గుండం వాగులోని ఇసుకను అక్రమంగా తోడేస్తుండటంతో రైతులు అడ్డుకునేందుకు వెళ్లగా ఇసుక మాఫియా వారిపై దాడికి తెగబడింది. దీంతో ప్రాణ భయంతో రైతులు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ.. ఇసుక అక్రమ వ్యాపారం చేసే కాంగ్రెస్ నాయకుల వల్ల గుండం వాగులోని ఇసుక మొత్తం ఖాళీ కావడంతో వాగులోని మోటర్లు బయట పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలను రక్షించుకునేందుకు వాగు వద్దకు వెళ్లగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నాగశేషి, వెంకటయ్య, నరసింహ, ప్రసాద్ గౌడ్ వచ్చి దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ‘మా వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. తవ్వకాలకు అడ్డు వస్తే మీ అంతు చూస్తాం’ అని హెచ్చరించినట్టు బాధిత రైతులు వాపోయారు.