హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్‌ను త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. టిమ్స్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆర్అండ్బీ, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నీటి సరఫరా, విద్యుత్తు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, ఫైర్‌సేఫ్టీ వ్యవస్థలను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయాలని సూచించారు. సీటీ సాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర ఆధునిక యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులో ఉండేలా అవసరమైన డాక్టర్లు, టెక్నీషియన్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యసేవలు అందించగల అత్యుత్తమ సంస్థగా టిమ్స్ నిలువాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, అవయవమార్పిడి శస్త్రచికిత్సలకు ఈ హాస్పిటల్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దుతున్నామని పేరొన్నారు. రోగులతోపాటు వారి సహాయకులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.