Sampath Kumar | హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం మద్దతు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది మాలలు.. వర్గీకరణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్టీ నాయకత్వం అంగీకరించిన నేపథ్యంలో అందరూ సహకరించాలని కోరారు. కానీ కొంత మంది మాలలు పార్టీలో ఉంటూ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అలాంటి వారిని గుర్తించి వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నట్టుగా తెలిసింది.
హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు అభిప్రాయాలను తెలపాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. ఈ మేరకు వారికి లేఖలు రాశారు. ఇప్పటికే ఎస్సీ సంఘాలు, వ్యక్తుల నుంచి ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన వినతులు, అభిప్రాయాలు, అభ్యర్థనలను కమిషన్ స్వీకరిస్తున్నది. తాజాగా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా లేఖలు రాసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.