ములుగు, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ): భక్తులు కొంగు బంగారంగా భావించే మేడారం మహా జాతరలో అతి ముఖ్యమైనది బెల్లం ప్రసాదం. దీనిని భక్తులు బంగారంగా భావించి ప్రసాదాన్ని పంపిణీ చేసుకుంటారు. కోరిన కోర్కెలు తీరితే భక్తులు ఎత్తు బెల్లాన్ని తల్లులకు సమర్పిస్తారు. కొందరు భక్తులు తమ ఇండ్ల వద్ద ఎత్తు బెల్లాన్ని కొనుగోలు చేసి కొద్ది మొత్తంలో మేడారానికి తరలించి తల్లులకు సమర్పిస్తుంటారు.
మరి కొంతమందరు మొ క్కు ప్రకారం తమ బరువుకు సరితూగే బెల్లాన్ని మొత్తం తరలించి మేడారంలో తల్లుల గద్దెల వద్ద సమర్పిస్తారు. ఈ బెల్లాన్ని గద్దెల వద్ద వలంటీర్లుగా పనిచేస్తున్న వారు భక్తులకు ప్రసాదంగా అందించాలి. కానీ.. 10 కేజీల చొప్పున వచ్చే బెల్లం బుట్టలను వలంటీర్లు వెంటనే తీసుకెళ్లి ప్రత్యేక స్థలంలో భద్రపరుస్తున్నారు. చిన్న బెల్లం ముద్దలనే భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నారు. ఈ బెల్లాన్ని బెల్లం మాఫియా రీసైక్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నది.
వాటాలపై పంచాయితీలు
మేడారం జాతరలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 20 బెల్లం షాపులను గిరిజనులకు కేటాయించారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న బెల్లం వ్యాపారులు.. దుకాణాలను దక్కించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి బెల్లాన్ని దిగుమతి చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కిలో బెల్లాన్ని 60 నుంచి 70 చొప్పున విక్రయిస్తున్నారు. జాతర సందర్భంగా 500 టన్నుల బెల్లాన్ని విక్రయించే అవకాశాలు ఉన్నాయి.
గద్దెల వద్ద భక్తులు సమర్పించిన బెల్లాన్ని తిరిగి మార్కెట్లోకి పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. పాడైన బెల్లాన్ని గుడుంబా తయారీకి తరలిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. బెల్లం వ్యాపారులతోపాటు కొందరు స్థానికుల మధ్య వాటాల పంచాయితీలు తలెత్తి భౌతిక దాడులకు దిగారు. అయినా.. రీసైక్లింగ్ దందాకు చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ లి ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలు, బయో వ్యర్థాలపై యాత్రికులకు అవగాహన కల్పించింది.

మేడారం.. జనసంద్రం
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ఆదివారం లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. సమీపంలో పెద్దఎత్తున గుడారాలు వెలిశాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తల్లులను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ దర్శించుకున్నారు. గత రెండు నెలల కాలంలో 50 లక్షల మంది భక్తులు మేడారం సందర్శించినట్టు ఎస్పీ తెలిపారు. – తాడ్వాయి