హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): భారతదేశ పురోగమనమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహూ మహారాజ్, అంబేదర్ ఆశయాల సాధనే లక్ష్యంగా మహారాష్ట్రలో నెలకొల్పబడిన ప్రగతిశీల సామాజిక సంస్థ ‘శంభాజీ బ్రిగేడ్’ బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రగతిభవన్‌లో ‘శంభాజీ బ్రిగేడ్’ పదాధికారులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శంభాజీ బ్రిగేడ్ ఇక నుంచి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 2024 మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల శంభాజీ బ్రిగేడ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, పురోగమనమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, శంభాజీ బ్రిగేడ్ ఒకే భావజాలం, విధానాలతో కలిసి పనిచేస్తున్నాయని ఉద్ఘాటించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శంభాజీ బ్రిగేడ్ క్యాడర్‌తో పాటు 1600 మంది పదాధికారులు (రాష్ట్ర స్థాయి నుంచి బ్లాక్ లెవల్ వరకు) ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే రానున్న రోజుల్లో చేరికలు, రాష్ట్ర పదాధికారులకు బాధ్యతల అప్పగింతపై చర్చిస్తామని వెల్లడించారు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పటమే లక్ష్యంగా ఆయన కుమారుడు శంభాజీ పేరుమీద ఏర్పడిన సంస్థే శంభాజీ బ్రిగేడ్. పీష్వాల ప్రాభవం కారణంగా శివాజీ, ఆయన వారసులకు చరిత్రలో రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని ఈ సంస్థ వాదన. పీష్వాలు బ్రాహ్మణులు. మరాఠా చరిత్ర రాసింది కూడా వారేనని, అందువల్లనే శివాజీ వారసులకు ప్రాధాన్యం తగ్గించారని ఈ సంస్థ భావిస్తున్నది. శివాజీకి గురువుగా చెప్పబడుతున్న దాదాజీ కొండదేవ్ను గుర్తించేందుకు ఈ సంస్థ ఒప్పుకోవటంలేదు. అసలు ఆ పేరుతో ఎవరూ లేరని, శివాజీకి దాదాజీ కొండదేవ్ గురువు కానేకాదని చెప్తున్నది. మరాఠాల హక్కుల కోసం పోరాడుతున్నది. ఇదే సమయంలో బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే సిద్ధాంతాలు తమకు ఆదర్శమని ప్రకటించుకొన్నది. ఈ సంస్థకు మహారాష్ట్ర మరాఠా యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది.