హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకందారులను ప్రభుత్వం విస్మరించిందని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య 2.4 కోట్ల నుంచి 2 కోట్లకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై ఆధారపడి 12 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సంఘాలు, జిల్లా యూనియన్ల ఎన్నికలు జరిపించికపోవడంతో ఫెడరేషన్ నిరర్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంపకందారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఆయన డిమాండ్ చేశారు.
పశు వైద్య విద్యపై గ్రామీణ విద్యార్థుల ఆసక్తి
హైదరాబాద్, జూన్ 27 (నమస్తేతెలంగాణ): పశు వైద్య కోర్సులపై గ్రామీణ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర పశువైద్య యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మూడు వెటర్నరీ డిగ్రీ కాలేజీలో ప్రతి సంవత్సరం 270 మంది, 6 వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీల్లో 180 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఈ ఏడాది కొత్త పశు వైద్య కళాశాల ఏర్పాటు చేసి, ప్రవేశాలు కల్పిస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఏడాది ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్లో ఆ కాలేజీని చేర్చలేదు. దీంతో 2025-26లో కొడంగల్ పశు వైద్య కళాశాలలో ప్రవేశాలు ఉండవని అధికారులు పేర్కొన్నారు.