హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : పేద బ్రాహ్మణుల విదేశీ విద్యకు సంబంధించిన వివేకానంద విదేశీ విద్యా పథకంపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇప్పటికే సంక్షేమ శాఖ దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాత్రం దరఖాస్తులు ఆహ్వానించకపోవడంపై ఆశావహుల్లో ఆందోళన నెలకొన్నది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలకమండలిని ఏర్పాటుచేయకపోవడం, సంక్షేమ పరిషత్ చేపడుతున్న పథకాల కొనసాగింపునకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంపై బ్రాహ్మణ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేసి వివిధ సంక్షేమ పథకాలను అమలుచేసిన విషయం తెలిసిందే. ఇందులో వివేకానంద విదేశీ విద్యా పథకం ముఖ్యమైనది. విదేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన బ్రాహ్మణ విద్యార్థులకు ఈ పథకం కింద రూ.20లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏటా 100 నుంచి 150 మంది వరకు లబ్ధిపొందారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.50కోట్లు కేటాయించింది. అయితే, నిరుద్యోగుల కోసం ఉద్దేశించిన స్వయం ఉపాధి పథకం, వివేకానంద విదేశీ విద్యా పథకానికి సంబంధించి లబ్ధిదారుల బకాయిలు రూ.50 కోట్లకుపైగా పెండింగ్ ఉండడం గమనార్హం. విదేశీ విద్యాలయాల్లో 2024-25విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పథకంపై స్పష్టత ఇవ్వకపోవడం, దరఖాస్తులు ఆహ్వానించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.