పెబ్బేరు, జూలై 9: కేసీఆర్ ప్రభుత్వం 2021లో హెయిర్ కటింగ్ సెలూన్లు, ల్యాండ్రీ షాపులకు ప్రతి నెలా ఉచిత విద్యుత్తును అందించి ప్రోత్సహిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు కట్టాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నదని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరమేశ్నాయి విమర్శించారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వారికి వచ్చిన కరెంట్ బిల్లులను చూపించి ఆవేదన వ్యక్తంచేశారు.
ఏడు నెలల కిందటి వరకు తమ షాపులకు జీరో బిల్లులు వచ్చాయని, ఇప్పుడు రూ.వందల్లో బిల్లులు వస్తున్నాయని వాపోయారు. ప్రస్తుత సర్కారు కూడా ఉచిత విద్యుత్తును అమలు చేసి బిల్లులు రాకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సెలూన్ల యజమానులు బాలకృష్ణ, శంకర్, భాస్కర్, ఎల్లయ్య, బాలరాజు, కృష్ణ, శ్రీనివాసులు, సత్యన్న, వరదరాజు, మంజునాథ్, వీరస్వామి, బాలు, లక్ష్మన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఎస్పీడీసీఎల్ తెలిపింది. ‘సెలూన్ల కరెంటుకు సర్కార్ కటింగ్’ పేరుతో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి స్పందించింది.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 4 నుంచి ఈ పథకం అమలవుతున్నట్టు తెలిపింది. సెలూన్లకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తున్నదని, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పద్ధతి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అంతకుమించి కరెంటు వాడినవారికి మాత్రమే బిల్లు వస్తున్నదని వెల్లడించింది. బిల్లుల వసూలులో తమ సిబ్బంది ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేసింది.