Gurukula Employees | హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగంలో చేరి తొలి వేతనం అందుకున్న రోజున పొందే ఆనందమే ఆనందం. తొలి వేతనంతో అమ్మానాన్నలకు బట్టలు కొనడం, ఇతర కుటుంబసభ్యులకు స్వీట్స్, గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటి దృశ్యాలు దాదాపు ప్రతి కొత్త ఉద్యోగి ఇంట్లో సర్వసాధారణం. కానీ, గురుకుల విద్యాసంస్థల్లో ఇటీవల ఉద్యోగం పొందినవారికి ఆ అనుభూతి లేకుండా పోయింది. ఉద్యోగంలో చేరి దాదాపు రెండు నెలలు అవతున్నా తొలి వేతనం అనేది అందని ద్రాక్షపండుగానే మిగిలిపోయింది. జూలైలో ఉద్యోగంలో చేరినవారికి ఇంకా తొలి వేతనమే అందలేదు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఒక్క కొత్త ఉద్యోగులదే కాదు.. పాత ఉద్యోగులదీ అదే కథ. గురుకులాల్లోని రెగ్యులర్ ఉద్యోగులకు కూడా సెప్టెంబర్ 1న అందాల్సిన జీతం ఇంకా రాలేదు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేవు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. ఇంకా నిధులు విడుదల కాలేదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీంతో అప్పులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తున్నదని గురుకుల ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్, పీడీ, లైబ్రేరియన్ తదితర పోస్టుల్లో ఇటీవల 8,307 మందికి రెగ్యులర్ ఉద్యోగాలొచ్చాయి. అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న వారంతా దాదాపు జూలై చివరి వారం నుంచి విధుల్లో చేరారు. వారెవరికీ ఇప్పటివరకూ వేతనాలు చెల్లించలేదు. నూతనంగా విధుల్లోకి చేరిన ఉద్యోగుల వివరాల నమోదు, బ్యాంక్ ఖాతాలు, సర్వీస్‌బుక్ ఎంట్రీ తదితర పనులన్నీ వెంటవెంటనే పూర్తి చేసిన సొసైటీలు వారికి వేతనాలను మాత్రం విడుదల చేయలేదు. జూలైలో పనిచేసిన రోజులతోపాటు ఆగస్టు నెల పూర్తి వేతనాన్ని సెప్టెంబర్ 1 తేదీన చెల్లించాల్సి ఉన్నది. కానీ, 18వ తేదీ వరకు కూడా జీతం పడలేదు. మొదటి నెల వేతనంతో తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు కానుకలిచ్చి మధురస్మృతిగా నిలుపుకోవాలని భావించిన నూతన ఉద్యోగులకు అది ఆడియాశగానే మిగిలింది.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ) పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, సీవోఈల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలను చెల్లించడం లేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీ, హానరోరియం ఇలా వివిధ రూపాల్లో 3,500 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. బోధన, బోధనేతర విధులను నిర్వర్తిస్తున్నారు. సదరు సిబ్బందికి జూన్, జూలై, ఆగస్టు వేతనాలను ఇప్పటికీ చెల్లించ లేదు. దీనిపై సొసైటీ ఉన్నతాధికారులు సైతం ఊసెత్తడం లేదు. వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తున్నదని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురుకులాల్లోని ఇతర రెగ్యులర్ ఉపాధ్యాయుల పరిస్థితి సైతం దయనీయంగా తయారైంది. ఒకటో తేదీన వేతనం అందుకోవడం అందని ద్రాక్షగానే మారింది. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లోని రెగ్యులర్ సిబ్బందికి సైతం ఇప్పటికీ వేతనాలు జమ కాలేదు. మైనార్టీ గురుకుల సిబ్బందిలో కొంతమందికి బుధవారం సాయంత్రం తరువాత జీతం పడ్డట్టు సమాచారం. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఎదురవుతున్నదని, ఏ తేదీన వేతనం వస్తుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేతనాలను సకాలంలో విడుదల చేయకపోవడంతో బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నామని, చెక్బౌన్స్లతో ఈఎంఐలు మిస్ అయ్యి అదనంగా జరిమానాలు చెల్లించాల్సి వస్తున్నదని రెగ్యులర్ ఉపాధ్యాయులు చెప్తున్నారు. సొసైటీ ఉన్నతాధికారుల తీరుతో సిబిల్స్కోర్లు సైతం దారుణంగా పడిపోయాయని, అప్పు కూడా పుట్టని పరిస్థితి ఎదురవుతున్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టే, తమకు కూడా ఒకటో తేదీన వేతనాలను 010 పద్దు ద్వారా చెల్లించాలని గురుకుల సిబ్బంది కోరుతున్నారు.