హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితాతో హస్తం పార్టీ గణం అక్రమాలు ఎలాంటివో ఈ అంశాన్ని పరిశీలిస్తే కండ్లకు కట్టినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు, యూఎల్సీ పార్శిళ్లను రక్షించడమే లక్ష్యంగా 22ఏ నిషేధిత జాబితాను తీసుకొచ్చామంటూ బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు అదే జాబితా పేరిట ‘కంచే చేను మేసిన చందం’గా దోపిడీకి తెగబడుతున్న వైనం తెలుస్తున్నది. ప్రభుత్వ భూముల పాలిట రాక్షసుల్లా మారి కరిగిస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ భూములను ‘హస్తగతం’ చేసుకోవడమే ప్రధాన ఉద్దేశమనేది సర్కార్ అడుగులతో తేలిపోయింది. ప్రభుత్వ భూములు, యూఎల్సీ పార్శిళ్ల మాటున భూములను చెరబట్టేందుకు నేతలు పావులు కలుపుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఈ భూములను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ అండదండలను అడ్డగోలుగా వినియోగిస్తున్నది.
మేడ్చల జిల్లా పీర్జాదిగూడ డివిజన్ పరిధిలో సర్వేనంబర్1లో సాలార్ జంగ్ కంచ భూములు 18 ఎకరాలు ఉన్నాయి. ఉప్పల్-వరంగల్ హైవేకు ఆనుకుని ఉండటంతో ఇక్కడ ఎకరం భూమి కోట్లు పలుకుతున్నది. ఈ 18 ఎకరాల్లో 12 ఎకరాలు దశాబ్దాల క్రితమే పట్టా భూమిగా నిర్ధారణ అయింది. దీనికి అనుగుణంగా అక్కడ కొనుగోలు చేసినవారు అనుమతులతో, నిబంధనలకు అనుగుణంగానే ఇండ్లు, లే అవుట్లు, కాలనీలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కానీ మిగతా 6 ఎకరాలు ప్రభుత్వ భూమిగా స్పష్టంగా రికార్డులో ఉన్నది. గత కొంతకాలంగా ఆ స్థలంలోనూ వివాదాలు నడుస్తున్నప్పటికీ, దశాబ్దాల కిందటే ప్రభుత్వ భూమిలో వెంచర్లు వేసి యథేచ్ఛగా విక్రయించుకున్నారు. అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం గుడ్డిగా వ్యవహారించడంతో ఆ భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి.
సాలార్ జంగ్ కంచ భూముల్లోని ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న 6 ఎకరాలను రక్షించాల్సింది పోయి.. 18 ఎకరాలను ఆరు నెలల క్రితం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. ఇక్కడే రంగప్రవేశం చేసిన కాంగ్రెస్ నేతలు.. అధికారులను ప్రలోభాలకు గురిచేసి, ఇప్పటివరకు గజం జాగ లేని సర్వేనంబర్ 1ఏను తెరమీదకు తీసుకొచ్చారు. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వివాదం లేని 12 ఎకరాల ప్రైవేట్ పట్టాదారుల ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అదే సమయంలో మిగతా 6 ఎకరాల విలువైన సర్కార్ భూమికి రక్షణ కల్పించాలి. కానీ ఇక్కడే రెవెన్యూ అధికారుల అండదండలతో బడా కాంగ్రెస్ నేతలు కపట నాటకానికి తెరలేపారు. మొదట సర్వేనంబర్ 1 మొత్తాన్ని నిషేధిత జాబితాలో చూపించారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు.
వారి నుంచి అందినకాడికి దండుకున్నారు. ఆ తర్వాత ఘట్టంలో రెవెన్యూ రికార్డుల్లో అసలు ఉనికేలేని బై సర్వేనంబర్(1ఏ)ను కొత్తగా సృష్టించారు. నిషేధిత జాబితా నుంచి ఆ 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పించి, ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చే ప్రక్రియ ఎప్పుడో పూర్తి చేసుకున్నారు. సర్కార్ పెద్దల కనుసన్నల్లోనే ఈ జిమ్మిక్కులు జరిగాయనే చర్చ నడుస్తున్నది. భూమిలేని సర్వేనంబర్ 1ఏను తెరమీదకు తీసుకురావడంతో నిషేధిత జాబితా మాటున రికార్డుల్లో భూమి ఉంటుందే తప్ప.. క్షేత్రస్థాయిలో అడుగు జాగ కూడా ఉండదని స్థానికులు చెప్తున్నారు.
భూమి లేని సర్వేనంబర్లను తెరమీద పెట్టి, చేజిక్కించుకున్న భూములను ఇతర బై సర్వేనంబర్లతో ప్రభుత్వ భూములను కరిగిస్తుంటే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ యంత్రాంగం కండ్లుండీ చూడలేని స్థితిలో ఉన్నది. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యతను గాలికొదిలేసి అక్రమార్కులకు రెడ్ కార్పెట్ వేస్తున్న పాలకుల కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకొని, సర్వేనంబర్ 1లో ఉన్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.