హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే మొట్టమొదటి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు కేఎల్ యూనివర్సిటీ వెల్లడించింది. సోమవారం హెచ్‌సీఎల్ సంస్థతో యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రాక్టికల్ ప్రాజెక్ట్‌లు, ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్, సాంకేతికలను అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని కేఎల్ యూనివర్సిటీ బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): మాతృభాషనే విద్యా వికాసానికి మూలమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మాతృభాషా బోధనతోనే సమగ్ర వికాసం సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ(ఎస్‌ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో మాతృభాషకు భాషాంజలి పేరిట రాష్ట్రస్థాయి విద్యాసదస్సు నిర్వహించారు.
రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ జీ రమేశ్ మాట్లాడుతూ.. భాషాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. చిన్నారుల చేత సృజనాత్మక రచనలను టీచర్లు ప్రోత్సహించడం అభినందనీయమని, ఇలాంటి వారికి మరింత తోడ్పాటు అందిస్తామని చెప్పారు. అనంతరం 45 మంది తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ పురస్కారాలు అందజేశారు.