న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : దేశంలో అతిపెద్ద ఐపీవోకి రిలయన్స్ ఇండస్ట్రీస్నకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో సిద్ధమవుతున్నది. ఈ నెల 21న ప్రారంభంకానున్న వాటాల విక్రయం ఈ నెల 23న ముగియనున్నదని కంపెనీకి సంబంధించిన వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ డిజిటల్ సర్వీసును ఈ నెల 28న స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని సంస్థ యోచిస్తున్నది. ఈ నెల చివర్లో లిస్ట్ కానున్న జియో ప్లాట్‌ఫామ్ విలువ 143-146 బిలియన్ డాలర్లు లేదా రూ.12 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా.
ఈ ఐపీవోపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. దేశంలో అతిపెద్ద ఐపీవో అయిన జియో ప్లాట్‌ఫామ్ ఐపీవో విలువ 3.8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా. 2008 తర్వాత రిలయన్స్ గ్రూపు నుంచి వస్తున్న తొలి ఐపీవో ఇదే కానున్నది. ఈ ఐపీవోకి సంబంధించి ఆగస్టు 28న మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్న సంస్థ.. గత నెలలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.