మా బాబు రాత్రి నిద్రలో పళ్లు కొరుకుతున్నాడు. ఇలా పళ్లు కొరకడం సహజమేనా లేక ఏదైనా పెద్ద సమస్యా? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? పిల్లలు పళ్లు కొరకొద్దంటే ఏం చేయాలి?
పిల్లలు రాత్రిపూట నిద్రలో పళ్లు కొరకడం, పళ్లు నూరడం, దవడలు గట్టిగా బిగించడం అనేది సహజమే. దీనిని వైద్య పరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లల్లో.. దాదాపు 40శాతం మందిలో ఈ బ్రక్సిజం అనే సమస్య కనిపిస్తుంది. అయితే, వాళ్లు పెద్దగా అయ్యేకొద్దీ దీనినుంచి బయటపడతారు. బ్రక్సిజం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అవేక్ బక్రిజం.. అంటే మెలకువలో ఉన్నప్పుడు పళ్లు కొరకడం. రెండోది స్లీప్ బ్రక్సిజం.. నిద్రలో పళ్లు కొరకడం. ఇలా నిద్రలో పళ్లు కొరకడం అనేది చాలా కామన్‌గా కనిపిస్తుంది. అయితే, ఎప్పుడో ఓసారి.. నెలలో ఒక్కసారి ఇలా పళ్లు కొరుకుతున్నాడంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారంలో నాలుగైదు రోజులు ఇలా పళ్లు కొరకడం, అదికూడా ఐదారు నెలలపాటు ఉంటేనే దానిని ‘బ్రక్సిజం’గా గుర్తిస్తాం. ఇలాంటి సమస్యతో వైద్యుల దగ్గరికి వచ్చే పిల్లల్లో అడినాయిడ్స్, అటెన్షన్ డెఫీషియెన్సీ, హైపర్ యాక్టివ్, ఏడీహెచ్‌డీ, తినేటప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ రావడం లాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా?
అనేది చూస్తాం. సరిగ్గా నిద్ర పోకపోవడం, గురక పెట్టడం, నోరు తెరిచి నిద్రపోవడం, పళ్లు, దవడల్లో నొప్పి, దవడ కండరాలు బిగుసుకుపోవడం లాంటి సమస్యలు, కొత్తగా పళ్లు వస్తున్నాయా? అనేది కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే.. ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలు తరచుగా నిద్రలో పళ్లు కొరుకుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన ఉన్నా ఇలాంటి సమస్య కనిపిస్తుంది. తరచుగా పళ్లు కొరికే పిల్లలు.. పొద్దున్న లేవగానే తలనొప్పి అంటారు. పళ్లు, దవడల్లోనూ నొప్పితో బాధపడతారు. అయితే, ఈ నిద్రలో పళ్లు కొరకడం అనే సమస్యకు ప్రత్యేకంగా చికిత్స, మందులు ఏమీలేవు. సమస్యకు ఒత్తిడే కారణమైతే.. తల్లిదండ్రులే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంది. నోరుకూడా తెరవలేనంతగా నొప్పితో బాధపడుతున్నారు అంటే.. డెంటిస్ట్‌కు సిఫారసు చేస్తాం. వాళ్లు పరిశీలించి.. పళ్లు, ఎనామిల్ బాగా దెబ్బతింటున్నట్లు గుర్తిస్తే, ‘బ్రక్సిజం నైట్గార్డ్’ సూచిస్తారు. అవసరమైతే ఓరల్ మోటర్ థెరపీకి పంపిస్తారు.