హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 35 మంది జూనియర్ లెక్చరర్లపై ఇంటర్ విద్యాశాఖ వేటు వేసింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంటూ ఆయా లెక్చరర్లకు వ్యక్తిగతంగా నోటీసులు పంపించింది. వీరంతా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా నియమితులై రెగ్యులరైజ్ అయిన వారే. రాష్ట్రంలో ఇంటర్ విద్యాబోధన కోసం గత 2 దశాబ్దాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమిస్తున్నారు. ఆ నియామకాల సమయంలో అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు పలుమార్లు వెరిఫై చేశారు. ఆ క్రమంలో పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారు.
మరి కొందరు అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమవడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీలకు పంపి అసలైనవో, నకిలీవో తేల్చాలని కోరారు. అవి ఫోర్జ్డ్ సర్టిఫికెట్లని యూనివర్సిటీలు నిర్ధారించడంతో సదరు లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన ఇంటర్ విద్యాశాఖ.. తాజాగా 35 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో వీరి సర్టిఫికెట్లు అసలైనవేనని గతంలో నిర్ధారించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీబీసీఐడీ, విజిలెన్స్ విచారణ జరుపాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మరో 320 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లపైనా అనుమానాలున్నాయి. వీటిలో చాలా సర్టిఫికెట్లు ఇతర రాష్ర్టాల వర్సిటీల నుంచి పొందినవే. మధురై కామరాజ్, అన్నామలై, రాంచీ, బుందేల్‌ఖండ్, లలిత్ నారాయణ్ తదితర యూనివర్సిటీల నుంచి ఈ సర్టిఫికెట్లు పొందినట్టు తెలుస్తున్నది. దీంతో వీటిని కూడా ఆయా వర్సిటీలకు పంపి, పరిశీలన చేయిస్తున్నారు.