హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ పరిధిలో పనిచేస్తున్న చిరుద్యోగులకు సకాలంలో ఎప్పుడూ వేతనాలు అందడం లేదు. నేటికీ సగంమంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం పెండింగ్‌లోనే ఉన్నది. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు కలిపి మొత్తంగా రూ.150 కోట్లను ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలల హాజరు ప్రక్రియ మాత్రమే పూర్తికావడంతో రాష్ట్రంలోని సుమారు 52,473 మంది మల్టీపర్పస్ వరర్లకు రెండు నెలలు వేతనాలే బుధవారం నుంచి అందనున్నాయి.
జూన్ నెల వేతనం వారం, 10 రోజుల్లో చెల్లిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదేశాఖలో పనిచేస్తున్న మిగతా 40 వేల మంది చిరుద్యోగులు మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ శాఖ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 92 వేల పైచిలుకు మంది చిరుద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్సస్ వర్కర్లే 52,473 మంది ఉన్నారు. మిగతా విభాగాల్లో మరో 40,000 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రతినెలా వేతనాల చెల్లింపునకు రూ.115 కోట్లు అవసరం. కానీ, ఎప్పుడూ ఈ మొత్తం విడుదల కానేలేదు. సకాలంలో వేతనాలు అందనూలేదు.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న 92 వేల మంది చిరుద్యోగులకు ఏనాడూ సక్రమంగా వేతనాలు అందకపోయినా, తమ ప్రభుత్వం ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు వల్లెవేస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క కూడా ఇవే అబద్ధాలను మళ్లీ మళ్లీ చెప్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే 92 వేల మంది ఉద్యోగులకు ఇకపై గ్రీన్‌చానల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి కూడా ఒకటో తేదీనే వారి ఖాతాల్లో వేతన మొత్తాన్ని జమచేస్తామన్న మంత్రి సీతక్క హామీ నేటికీ అమలుకు నోచలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతదని అనుకున్నం. కానీ, జీతం ఎప్పడొస్తదో గ్యారెంటీ లేదు. 3-4 నెలలకు ఒకసారి ఇస్తున్నరు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. పేస్కేల్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కానీ, కనీసం వేతనాలు కూడా నెలనెలా ఇవ్వడం లేదు. నాకు రెండు గ్రామ పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. కొందరికి నాలుగు, మరికొందరు ఆరు పంచాయతీల బాధ్యతలు ఉన్నాయి. పని చేయించుకుంటున్నరు. కానీ జీతం మాత్రం సక్రమంగా ఇస్తలేరు.
-బానోతు భద్రునాయక్, ఫీల్డ్ అసిస్టెంట్, శివాయిగూడెం రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా
మాకిచ్చే జీతమే పది వేలు. అది కూడా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులైతున్నయ్. ఇల్లు కూడా గడుస్తలేదు. ఉద్యోగం బంద్జెయి అంటున్నరు. ఇంట్ల ఆడోళ్లు కూలిపనులకు పోయి ఎళ్లదీస్తున్నారు. మహిళా సంఘంల లోన్ నెలవారీ డబ్బులు కూడా కట్టలేకపోతున్నం. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలనెలా ఇయ్యకపోతే భార్యబిడ్డలతో ఎట్ల బతకాలె. ఇండ్లు ఎట్ట నడవాలే?
– యాదగిరి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ కట్టంగూర్ అధ్యక్షుడు,