హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ): తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వరకు తొమ్మిది రోజులపాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. అక్టోబర్ 3న ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళ్లల్లో ఒకో వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. గరుడ వాహనసేవకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది.
ఏపీ టూరిజం ప్యాకేజీ ముసుగులో టీటీడీ నకిలీ టికెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్ అధికారులు రట్టుచేశారు. ఏపీ టూరిజం పేరుతో చెన్నైకి చెందిన ట్రావెల్స్ ఏజెంట్, టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, ఏపీ టూరిజం ఉద్యోగి ముఠాగా ఏర్పడి ప్రతి రోజు 30-40 మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనాలకు పంపిస్తున్నట్టు గుర్తించింది. వీరిపై నిఘా ఉంచిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఐదుగురు సభ్యులున్న ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు.