Lok Sabha Elections | హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : వీరతిలకం ఎవరి నుదుటన మెరుస్తుంది? గెలుపుమాల ఎవరి మెడను వరిస్తుంది? రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజల్లో ప్రారంభమైన ఆసక్తికర చర్చ ఇది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి వేగం పుంజుకుని గత ఎన్నికల పోలింగ్ శాతాన్ని అందుకున్నది. ఆరేడు స్థానాల్లో రాష్ట్ర పోలింగ్ సగటు కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. పట్టణ ఓటరు కన్నా గ్రామీణ ఓటరే ఎక్కువ చైత న్యం ప్రదర్శించాడు. ఫలితంగా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఈ ఎన్నికలు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్నది ఓటింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. కాకపోతే, పార్టీలన్నీ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి.
ఐదు నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితికి, సోమవారం నాటి లోక్‌సభ ఎన్నికలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీపడిన అభ్యర్థులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ శ్రేణులు పోలింగ్‌బూత్‌ల వద్ద మోహరించాయి. ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో ఎవరు ఓట్లు వేశారు? ఎవరు వేయలేదో సరిచూసుకొని ఓటు వేయనివారిని పోలింగ్‌బూత్‌లకు రప్పించాయి. సోమవారం మాత్రం అటువంటి దృశ్యాలు కనిపించలేదు. జహీరాబాద్, మెదక్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం వంటి స్థానాల్లో రాష్ట్ర సగటు పోలింగ్‌శాతం కన్నా ఎక్కువగా నమోదైంది. హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో రాష్ట్ర సగటుకన్నా తక్కువగా రికార్డు అయింది. ఎక్కువగా నమోదైన పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం, పోలింగ్‌శాతం తక్కువగా నమోదైన నియోజకవర్గాల్లో ఎవరు లాభపడతారు? ఎవరు లాస్ అవుతారు? అనేది అంచనాకు అందడం లేదు.
17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నమోదైన పోలిం గ్ శాతాన్ని బట్టి బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు తమదే విజయం అని గంభీర ప్రకటనలు చే స్తున్నా, లోలోపల అంతుచిక్కని ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. జాతీయ పార్టీలు రెండూ తొలి నుం చీ ద్విముఖ పోటీగానే భావించాయి. ఈ భావనను, వాటి ఆశలను బీఆర్ఎస్ తలకిందులు చేసిందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతున్నది. ఫలితాలు ఇలా ఉండొచ్చంటూ విశ్లేషకులు చెప్తున్న సంఖ్యలు వాస్తవానికి ఎంతవరకు దగ్గరగా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. 15 లక్షల నుంచి 22 లక్షల (మల్కాజిగిరిలో దాదాపు 38 లక్షలు) ఓటర్లు ఉన్న ఒ క్కో నియోజకవర్గంలో 5వేల నుంచి 15వేల మం ది ఓటర్లను శాంపిల్‌గా (ఎగ్జిట్‌పోల్స్) తీసుకొని అదే ఫలితమని చెప్పడం శాస్త్రీయ, వాస్తవిక అంచనా ఎలా అవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రానికి పెరిగింది. ఆరు గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన 62.72 శాతం కన్నా ఈసారి ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. ఈ శాతంలో కొంత మార్పు ఉండే అవకాశం ఉన్నది. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి స్ట్రాంగ్‌రూంలకు ఈవీ ఎం మిషన్లు వెళ్లే సమయంలో రికార్డు అయిన శాతా న్ని తుది పోలింగ్ శాతంగా చెప్తారు. అందుబాటు లో ఉన్న సమాచారం ప్రకారం అది 65శాతంగా ఉంది. జహీరాబాద్, మెదక్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో 70 శాతానికి పై గా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర సగటు కంటే ఎక్కువ పోలింగ్ నమోదు అయితే అది ప్రభుత్వ వ్యతిరేకతగా మారే అవకాశం ఉందని గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62.72 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 2018లో రెండోసారి 88 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. అ ప్పుడు బీజేపీ (19.7శాతం) కన్నా ఎక్కువ పోలింగ్ శాతాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ (29.8 శాతం)కి వచ్చిన ఎంపీ సీట్లలో తేడాలున్నాయి. ఈ లెక్కన పోలింగ్ గడువు ముగిసిన తరువాత వివిధ సామాజిక మాధ్యమాల్లో పొంగిపొర్లుతున్నవి నిజా‘ఇజా’లే తప్ప వాస్తవాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈ పెరిగిన పోలింగ్‌శాతం రాష్ట్రంలోని కాంగ్రెస్‌కు, కేంద్రంలో మూడోసారి అధికారం కో సం పోటీపడుతున్న బీజేపీకి కలిసి వస్తుందా? లే దంటే, తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్కు కలిసివస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఎన్నిక ఎన్నికకూ ఓటరు నాడిని అంచనా వేయడం అంత సులువైన పనికాదని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మరోసారి నిరూపించింది. గతంలో ఓటు వేసిన తరువాత ఓటరు ఏదో ఒకరకంగా తానెవరివైపు మొగ్గుచూపారో చెప్పకనే చెప్పే పరిస్థితులు ఉండేవి. ఐదు నెలల క్రితం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కానీ, సోమవారం లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కానీ పోలింగ్‌బూత్‌కు వచ్చిన ఓటరు తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు సుముఖత చూపలేదు. ఫలితంగా అభ్యర్థులు, ఆయా పార్టీల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడి మొత్తం ఓటర్లు, నమోదైన పోలింగ్ శాతం, అందులో పార్టీల వారీగా పోలైన ఓట్లను అంచనా వేయడం, అదీ మౌనముద్రలోకి జారుకున్న ఓటరు స్థితిని పరిగణనలోకి తీసుకొని అంచనా వేయడం దుర్లభమే అవుతుందని రాజకీయ పరిశీలకులకు చెప్తున్నారు.