హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): పనిచేసే ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేసేందుకు రాష్ట్రప్రభుత్వ మార్గనిర్దేశంలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ మరో కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. షీటీమ్స్, భరోసా, ఫ్యామీలీ కౌన్సెలింగ్ సెంటర్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి మాడ్యూల్స్ తరహాలో ‘సాహస్’ కూడా ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పనిప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ కావటంతో, పకడ్బంధీ వ్యవస్థను అమలు చేసేందుకు ఉమెన్ సేఫ్టీవింగ్ సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త వ్యూహాన్ని ఈనెల 19 నుంచే అమలు చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ ప్రారంభించబోయే ఈ ‘సాహస్’ కార్యక్రమం ప్రత్యేకించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు ఉద్దేశించినది. ఆకతాయి ఉద్యోగుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే పని ప్రదేశాల్లో మహిళపట్ల వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన కొన్ని కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవటంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈనేపథ్యంలో వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.
సాహస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కమిటీలను షీటీమ్స్ నిరంతరం పర్యవేక్షించనున్నాయి. కమిటీకి సైతం చెప్పుకోలేని ఫిర్యాదులను వెబ్సైట్, ఫోన్ ద్వారా కూడా స్వీకరించనున్నారు. పని ప్రదేశాల్లో మహిళలను వేధించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఈ సమస్యకు ఆదిలోనే పుల్‌స్టాప్ పెట్టేలా.. నేరుగా పనిచేసే ప్రదేశంలో వేధింపులను కట్టడి చేసేలా కార్యచరణ రూపొందించారు ఉమెన్ సేఫ్టీవింగ్ ఉన్నతాధికారులు. సాహస్ ద్వారా వేధింపులు నిరూపితమైతే.. తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఈనెల 19న వెల్లడికానున్నాయి.