Nagarjuna Sagar | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/న్యూస్‌నెట్‌వర్క్: కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు ఇన్‌ఫ్లో 2.60 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,52,987 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలానికి 4.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో నిండుకుండలా మారింది. ఆదివారం 3,21,873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 37,873 క్యూసెక్కులుగా నమోదైంది.
సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడానికి ఎన్ఎస్పీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 574.90 అడుగులకు చేరుకున్నది. ఇంకా 15 అడుగులు మేర నీరు చేరడానికి మరో రెండు రోజుల సమయం పట్టనున్నది. శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో 19,645 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,518 క్యూసెక్కులుగా నమోదైంది. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు ఆదివారం 4,87,010 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా బరాజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.